Barhaspatya

‘బృహస్పతి’ శబ్దం నుంచి బార్హస్పత్య పదం ఉద్భవించిందన్నది స్పష్టం. అంటే బార్హస్పత్యుడు బృహస్పతి సంతతికి చెందినవాడు అని అర్థం. బృహస్పతి దేవతల గురువన్న సంగతీ తెలిసిందే. అయితే బార్హస్పత్య ఋషి అని వేరే ఎవరైనా ఉంటే వారి గురించి ఇతర విశేషాలు తెలియరావడం లేదు.

అగ్నికి ‘బృహస్పతి’, ‘బ్రాహ్మణస్పతి’ అన్న పేర్లు ఉన్నాయి. బృహస్పతి అంటే అధిదేవత అనీ, బ్రాహ్మణస్పతి అంటే ప్రార్థనలకు అధిదేవుడని అర్ధం. కొన్ని సందర్భాలలో ఈ ఇద్దరు దేవులు వేర్వేరనీ ఉంది.

మనం సంకల్పం చెప్పుకునేటపుడు ‘స్వస్తిశ్రీ చాంద్రమాన (ఫలానా) నామ సంవత్సర..’ అంటూ ఆరంభిస్తాం కదా, మనది చాంద్రమానం. అంటే మన కాలమానం అంతా చంద్రుడి ఆధారంగా జరుగుతుంది. మనకు పౌర్ణమి మంచిరోజు. మనకు నెలలో ఉన్న రెండు పక్షాలు శుక్లపక్షం, కృష్ణపక్షం (బహుళ పక్షం) చంద్రుడి ఆధారంగా ఏర్పడ్డవే. శుక్లపక్షం అంటే అమావాస్య తరువాత చంద్రుడు తిరిగి శక్తి పుంజుకుంటూ నిండుపున్నమి వరకు పెరిగే 15 రోజుల కాలం. అలాగే కృష్ణపక్షం అంటే నిండుపున్నమి తరువాత క్రమంగా చంద్రుడు తన కళను కోల్పోతూ ఉండే 15 రోజులు అని తెలిసిందే. మన తెలుగు నెలల పేర్లు చంద్రుడి ఆధారంగా ఏర్పడ్డవే. పౌర్ణమిరోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరుమీదే ఆ నెలకు పేరు వస్తుంది. పౌర్ణమిరోజున చిత్ర నక్షత్రం వుంటుంది కనుక ఆ నెల ‘చైత్రం’ అయింది, విశాఖ నక్షత్రం ఉంటే అది ‘వైశాఖం’. అలాగే మిగిలిన నెలల పేర్లు వచ్చాయి.

మనది చాంద్రమానం అయితే తమిళనాడులోని వారిది సౌరమానం. అంటే వారి లెక్కలన్నీ సూర్యుడి కదలికలను బట్టి రూపొందాయి. ఈ కారణంగానే వారికి అమావాస్య మంచిరోజు. మన చంద్రమానానికి, వారి సౌరమానానికి 15రోజుల వ్యత్యాసం ఉంటుంది. అమావాస్య తర్వాత పాడ్యమి రోజున మనకు ఉగాది పండుగ వస్తే తమిళ తంబీలకు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమిరోజున ఉగాది వస్తుంది.

మన దక్షిణాదివారివి చాంద్రమాన, సౌరమానాలైతే, ఉత్తరాది రాష్ట్రాలలోని వారు పాటించేది బార్హస్పత్యమానం. వాళ్లవన్నీ బృహస్పతి గ్రహసంచారం ఆధారంగా రూపొందిన లెక్కలు. వాళ్లకు, మనకు దాదాపు నెల రోజుల వ్యత్యాసం ఉంటుంది.

బృహస్పతి లేదా బార్హస్పత్యుడు ఒకరో కాదో అనే విషయం పక్కన పెట్టి మనం ఇతర అంశాలనూ చూద్దాం. ముఖ్యంగా బృహస్పతి గురించి: బ్రహ్మమానస పుత్రుడైన అంగిరునికీ, శతరూపకూ కుమారుడు బృహస్పతి. అయితే, శతరూప పేరు ‘సురూప’గా కూడా కొన్నిచోట్ల కనిపిస్తోంది. బృహస్పతికి ఇద్దరు సోదరులు. వారు ఉతథ్య, సంవర్తన.

ఋగ్వేదం ప్రకారం బృహస్పతి తన గ్రహాన్ని (గురు గ్రహం) తానే నిర్మించుకున్నాడు. గురుగ్రహాన్ని పూజించటంవల్ల ఐశ్వర్యం, తెలివితేటలు వస్తాయి. గురువునుంచి లభించేది తెలివితేటలేకదా!

బృహస్పతికి ‘జీవ’ అని మరో పేరుకూడా ఉంది. దీనికి సంబంధించిన కథ ఇది: ఇంద్రుడు, ఆయన గురువైన బృహస్పతితో కలిసి ఒకసారి కైలాసానికి వెళ్లాడు. అక్కడ, శివుడు వీరికి ఒక దిగంబరుడిగా కానవస్తాడు. ఆయన శివుడేనని గుర్తించలేని ఇంద్రుడు, శివునిపైకి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఇది శివునికి కోపం తెప్పిస్తుంది. వెంటనే శివుడు, ఇంద్రుడిని భస్మీపటలం చేస్తాడు. అప్పుడు, బృహస్పతి శివుడిని ప్రసన్నం చేసుకుని, ఇంద్రుడిని సజీవుణ్ణి చేయించుకుంటాడు. ఇంద్రుడిని ‘జీవితు’డిని చేయించుకున్న కారణాన బృహస్పతికి ‘జీవ’ అన్న పేరు వచ్చిందని ఈ కథ.

గరుడ పురాణంలోని మరో కథ ప్రకారం `రామావతారకాలంలో భరతుడిగానూ (3`28`45), కృష్ణావతారకాలంలో ద్రోణుడిగానూ (3`28`47) బృహస్పతి జన్మించాడు. ఘృతుచి ద్వారా భరద్వాజునికి కుమారుడుగా ద్రోణుడు జన్మించాడన్నది తెలిసిందే.