Palakoderu

పశ్చిమ గోదావరి జిల్లా

పాలకొల్లు ప్రాభవాలు - గుంటుపల్లి కొండగుహలు
నర్సపురం అల్లికలు - కోయకొమ్ము నృత్యాలు
హేలాపురి కార్పెట్లు - నాణ్యమైన జూట్‌మిల్లు
తణుకులోన చక్కెరలు - కొల్లేరులో అందాలు
క్రోమైట్లు గ్రాఫైట్లు - మోనోజైట్లు ఇల్మనైట్లు
ఖరీదైన ఖనిజాలు- సహజవాయునిధులెన్నో
చెప్పలేని సిరిభూమి- ఇది పశ్చిమగోదావరి.. ఇది పశ్చిమగోదావరి..

పశ్చిమ గోదావరి జిల్లా గురించిన పాట ఇది. టీవీ`5 ఛానల్‌లో జిల్లా వార్తాప్రసార సమయానికి ముందు ప్రసారమవుతున్న పాట. మాల్కోస్‌ రాగం. 6-8.

పాట రాసింది పాలకోడేటి సత్యనారాయణరావు. రాష్ట్రంలోని 23 జిల్లాల గురించి, వాటి సంస్కృతీ సాహిత్య భౌగోళిక చారిత్రకాంశాలను ప్రస్తుతిస్తూ రాసిన 23 పాటల్లో ఇదొకటి. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే కాదు మరెక్కడా జరగలేదు, ఇలాంటి అపూర్వ అవకాశం, అదృష్టం సత్యనారాయణరావుకు తప్ప మరెవ్వరికీ దక్కలేదు. ఇది మన సొంత జిల్లా గురించి గర్వంగా రాసిన పాట.

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి పెద్ద నది గోదావరి. గోదావరికి పశ్చిమ దిశలో ఉన్న ప్రాంతాలను రెవిన్యూ అవసరాలపరంగా ఏకంచేస్తూ ఒక జిల్లాగా ఏర్పరచడంవల్ల దీనికి ‘పశ్చిమగోదావరి జిలా’్లగా నామకరణం చేశారు. గోదావరి నది పడమటి కనుమలలోని నాసికాత్రయంబకంలో పుట్టి, మహారాష్ట్రలో ప్రవహిస్తూ, ఆదిలాబాద్‌ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌ను చేరుతుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో ప్రవహించి, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలను చేరుతుంది. దీనికి మంజీరా, ఇంద్రావతి, కిన్నెరసాని, ప్రాణహితలు ఉపనదులు. మొత్తం 1465 కిలోమీటర్ల పొడవు ఉన్న గోదావరి నది, మన రాష్ట్రంలో 770 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 23 జిల్లాల్లో 5వ జిల్లా పశ్చిమగోదావరి. ఈ జిల్లాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. లభిస్తున్న చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ప్రాంతాన్ని వరుసగా మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, వేంగి తూర్పు చాళుక్యులు, చోళులు, వెలనాటి చోళులు, ముసునూరి రెడ్డిరాజులు, కొండవీడు రెడ్లు, కళింగ గజపతులు, గోల్కొండ కుతుబ్‌షాహిలు, మొగలులు, అసఫ్‌జాలు, బ్రిటిష్‌వారు పరిపాలించారు.

బాదామీ చాళుక్యులకు చెందిన రెండో పులకేశి తన రాజ్యాన్ని ఉత్తరాన నర్మద నుంచి దక్షిణాన కృష్ణానది వరకు విస్తరించాడు. ఆ విస్తరణలో భాగంగా ఆయన ‘సకల కళింగను నేలమట్టం చేసినట్లు’ ఐహోల్‌ శాసనంలో ఉంది. వేంగి తూర్పు చాళుక్యుల రాజ్యాన్ని రెండో పులకేశి తమ్ముడైన కుబ్జవిష్ణు స్థాపించాడు. ఈ సమయంలోనే ఈ ప్రాంతాన్ని సుప్రసిద్ధ చైనీస్‌ పర్యాటకుడు హ్యుయన్‌ త్సాంగ్‌ సందర్శించాడు.

అయితే భీమునిపట్నం తాలూకా పరిధిలోని భోగాపురం సమీపంలోని మంజేరులో లభించిన రెండు తామ్ర శాసనాలు మాత్రం ఈ ప్రాంతాన్ని ‘మధ్యమ కళింగ’గా పేర్కొనడం విశేషం. మహాభారతంలోనూ, బుద్ధుని జాతక కథలలోనూ కూడా వర్ణితమైన అప్పటి మధ్యమ కళింగ ప్రాంతం మహానదినుంచి గోదావరి వరకు విస్తరించి వుండేది. ఈ శాసనాలు క్రీ. శ.8వ శతాబ్దానిగా గుర్తించారు.

(పూర్వకాలంలో కళింగదేశాన్ని త్రిళింగ భాగాలుగా గుర్తించేవారు. దక్షిణ కళింగ నేటి గోదావరి జిల్లాలు కాగా మధ్య కళింగ నేటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, ఇక ఒకనాటి ఉత్తర కళింగ నేటి ఒరిస్సా రాష్ట్రం, ‘ఉత్తర కళింగ’ అన్న పదమే క్రమంగా ‘ఉత్కళ’ అయింది.

బ్రిటిష్‌ పాలకులు 1766లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు దీన్ని నాటి నిజామ్‌ పాలకుడు హసన్‌ అలీఖాన్‌కు లీజుకు ఇచ్చారు. మూడేళ్ల లీజ్‌ కాలం 1769లో ముగిశాక, మచిలీపట్నం ముఖ్య కేంద్రంగా చీఫ్‌ అండ్‌ కౌన్సిల్‌ పాలనను ప్రవేశపెట్టారు. 1794లో మద్రాస్‌ రాష్ట్రంలో కలెక్టరేట్‌ల ద్వారా పాలనా పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఒక్క మచిలీపట్నంలోనే ఒక్క చీఫ్‌ కలెక్టర్‌ ఉండేవారు. ఆయన అధికార పర్యవేక్షణలో కాకినాడలో ఒక డివిజన్‌, మొగల్తూరులో ఒక డివిజన్‌, రాజమండ్రిలో ఒక డివిజన్‌ వుండేవి. నేటి పశ్చిమగోదావరి జిల్లాలోని అధిక భాగం అప్పటి మొగల్తూరు డివిజన్‌లోనే ఉండేది. మొగల్తూరు డివిజన్‌లో తణుకు, ఉండి, నర్సాపురం, ప్రాంతాలుండేవి. ఈ డివిజన్‌కు తొలి కలెక్టర్‌గా గాంబియర్‌ ఉండేవారు. అప్పుడు ఏలూరు, మొగల్తూరు డివిజన్‌లో భాగంగా మచిలీపట్నం కలెక్టరేట్‌ పాలనలో వుండేది.

పాలనాసౌలభ్యం కోసం 1859లో ఉత్తర సర్కార్లను జిల్లాలుగా విభజించే సమయంలో రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను గోదావరి, కృష్ణా జిల్లాలుగా ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఏలూరు ప్రాంతాన్ని మచిలీపట్నం కలెక్టరేట్‌ నుంచి విడదీసి, కొత్తగా రూపొందిన గోదావరి జిల్లాలోకి చేర్చారు. 1904లో ఎర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నగరం ఐలండ్‌ మినహా మిగిలిన నర్సాపురం తాలూకాలను కృష్ణా జిల్లాలోకి మార్చారు. మళ్లీ 15 ఏప్రిల్‌ 1925 నాడు కృష్ణా జిల్లాను విడదీస్తూ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలుగా ఏర్పాటుచేశారు. అదే సమయంలో అప్పటివరకు గోదావరి జిల్లాగా ఉన్న ప్రాంతానికి కాకినాడను జిల్లా కేంద్రం చేస్తూ తూర్పు గోదావరి జిల్లాగా నామకరణం చేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు మొదట్లో మచిలీపట్నమే ముఖ్యకేంద్రంగా ఉండేది. 1926 జనవరి 4న ఏలూరును పశ్చిమగోదావరి జిల్లాకు ముఖ్య కేంద్రం చేశారు. తొలి కలెక్టర్‌గా ఎ.హెచ్‌. థడ్‌ ఉండేవారు. 1942లో పోలవరం తాలూకాను కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చారు. 1947లో నగరం తాలూకా కేంద్రాన్ని రాజోలుకు మార్చి దానికి రాజోలు తాలూకా అని పేరుపెట్టారు. 1959లో భద్రాచలం నూగూరు తాలూకాలను పశ్చిమగోదావరి జిల్లానుంచి ఖమ్మం జిల్లాకు మార్చారు. ఇన్ని మార్పుల ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత భౌగోళిక రూపం ధరించింది.

పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య కేంద్రం ఏలూరు. ప్రాచీన శాసనాలలో కానవచ్చే ఏళూరు నేటి ఏలూరు అయిందని ఏటుకూరి బలరామమూర్తి తమ ‘ఆంధ్రుల సంక్షిప్తచరిత్ర’ (పే.62)లో పేర్కొన్నారు. ఏలూరుకు చరిత్రలో హేలాపురి అన్న పేరుండేదని అంటారు.నేటి ఏలూరు ప్రాంతం ఒకప్పుడు వేంగి రాజ్యంలో భాగంగా ఉండేది.క్రీ.శ. 700 ప్రాంతంనుంచి సుమారు 1200వరకు తూర్పు చాళుక్యుల పాలనలో వుండేది. ఏలూరు ప్రాంతం అంతా 1471లో ముస్లిమ్‌ల దండయాత్ర వరకు కళింగరాజ్యంలో భాగంగా వుండేది. తర్వాత గజపతులు ఏలూరు ప్రాంతం పాలకులయ్యారు. 1515లో గజపతుల పాలననుంచి శ్రీకృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. చారిత్రక కారణాల వల్ల ఏలూరు ప్రాంతం మళ్లీ గోల్కండ నవాబు కులీ కుతుబ్‌షాహి పాలనలోకి వచ్చింది.

పశ్చిమగోదావరి జిల్లా 16 డిగ్రీలు 5 నిమిషాలు ` 17 డిగ్రీలు 30 నిమిషాలు ఉత్తర అక్షాంశం, 80 డిగ్రీలు 55 నిమిషాలు, 81 డిగ్రీలు 55 నిమిషాలు తూర్పు తులాంశాల ప్రాంతంలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాకు ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన కృష్ణా జిల్లాతో పాటు బంగాళాఖాతం, తూర్పున గోదావరినది, పశ్చిమాన కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మొత్తం 7,742 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, కిలోమీటరుకు 454 జనాభా సాంద్రతతో వున్న జిల్లా అది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అవసరమైన వరిలో 55శాతం పశ్చిమగోదావరి జిల్లాలోనే పండుతుంది కనుక ఈ జిల్లానే ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారం (Gతీaఅఅవతీవ శీట Aఅసష్ట్రతీa ూతీaసవంష్ట్ర ) అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాను నర్సరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (చీబతీంవతీవ శీట Aఅసష్ట్రతీa ూతీaసవంష్ట్ర) గానూ వ్యవహరిస్తారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు (ఏలూరు, నర్సాపురం), 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 45 మండలాలు వున్నాయి. వీటిలో ఉండి నియోజకవర్గంలో ఉంది పాలకోడేరు మండలంలోని పాలకోడేరు గ్రామం, పాలకోడేరు మండలంతో బాటు ఉండి కాళ్ల, ఆకివీడు మండలాలున్నాయి.

పాలకోడేరు

మనకు ఇంటిపేరును ఇచ్చిన పాలకోడేరు గ్రామం భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో, 16 డిగ్రీలు 35 నిమిషాలు అక్షాంశం, 81 డిగ్రీలు 32 నిమిషాలు తూర్పు తులాంశాల ప్రాంతంలో, గోదావరి నదికి ఉపనది అయిన గోస్తా (గోస్తనీ) నదీతీరం మీద వుంది. గోస్తానది నిజానికి ఒక పెద్ద కాలువలా ఉంటుంది. అన్నట్లు ‘గోస్తనీ’ నదీ తీరాన అంటే ‘పాలపొదుగు’ దగ్గర వుండే ఊరు పాలు ప్రవహించే పాలకోడేరుకాక మరేమవుతుందో ఆలోచించండి!!

పాలకోడేరు గురించిన మరికొన్ని వివరాలు
విలేజ్‌కోడ్‌: 01963400,
పంచాయత్‌ కోడ్‌: 217858, గ్రామ
జనాభా: (2001 ప్రకారం) 7,172
పోస్టల్‌ పిన్‌కోడ్‌ : 534 210.
యూనివర్సల్‌ టైమ్‌కోడ్‌ : 5.30 గం. GMT.